తెలుగు నేర్చుకోవాలి
ఆంధ్ర ప్రదేశం రాష్ట్ర భాష తెలుగు.అక్కడ బహుమంది దైనందిన కార్యకలాపాలు తెలుగులోనే చేస్తారు.కానీ ప్రవాసాంధ్రులు వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఆయా ప్రదేశ భాషను నేర్చుకోక తప్పదు.ఇలాంటి పరిస్థితిలో పిల్లలకి తెలుగు నేర్పటంలో తల్లి-తండ్రుల కర్తవ్యం మరికొంచెం ఎక్కువవుతుంది.
తెలుగు నేర్చుకోవటం ఎందుకు అవసరమైంది ఒక విద్యార్థి కి ? అదే ఇప్పుడు ఈ కథ లో తెలుసుకోబోతున్నాం.
౧౯౭౫ (1975) సంవత్సరంలో శేఖర్ వారి నాన్నగారు శ్రీ మూర్తిగారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం రిత్యా ఒరిస్సా రాజధాని నగరం భువనేశ్వర్ కు వలస వచ్చారు.ఏడాదికి ఒకసారి ఆంధ్ర ప్రదేశ్లో విశాఖపట్నం మరియు పార్వతీపురం వచ్చి వెళుతూ ఉండేవారు.శేఖర్ ఇంక తన తమ్ముడు భువనేశ్వర్ లో ప్రభుత్వేతర పాఠశాలలో చదువుకునేవారు ౧౯౮౩ సంవత్సరం ఒకటవ తరగతి నుండి. అక్కడ ఇంట్లో అమ్మ-నాన్నలతో తెలుగులో మాట్లాడిన, బయట అంట ఒరియా మాట్లాడతారు.ఎందుకంటే ఒరిస్సాలో బహుమంది మాట్లాడే భాష ఒరియా కాబట్టి.భువనేశ్వర్ లో ప్రవాసాంధ్రుల ఆంధ్ర సంస్కృతీ సమితి కూడా ఉన్నది.
ప్రతి సంవత్సరం వేసవి సెలవులలో అమ్మమ్మగారి ఇంటికి ప్రయాణం ఒక ఆనందం.ఎందుకంటే అక్కడ అమ్మమ్మగారు చేసే రకరకాల పిండివంటలు, తాతగారు చెప్పే కథలు, మావయ్యలు, అత్తలు, బావలు, మరదళ్ల తో మాటల కాలక్షేపం ఒక సరదాగా ఉండే సమయం.అదే కాకుండా పార్వతీపురంలో మామ్మగారి ఇంట్లో సరదా వేరుగా ఉండేది. అంతే కాకుండా ముఖ్యమైన మనోరంజక విషయం ఆకాశవాణిలో తెలుగు కార్యక్రమాలు వినటం , తెలుగు పాటలు వినటం.విశాఖపట్నంలో చలనచిత్ర భావంతులలో తెలుగు చలన చిత్రాల వీక్షణం.
అది ౧౯౮౫ సంవత్సరం నాటి మాట.శేఖర్ మూడవ తరగతిలో చదువుతుండెను.అప్పటికి వయసు తొమ్మిది సంవత్సరాలు.ఎప్పటిలాగానే వేసవి సెలవులలో శేఖర్ అమ్మ నాన్నలతో విశాఖపట్నం వెళ్లారు. ఇక దారిలో పలు చిత్రాల ప్రకటన చిత్రాలు కనిపించెను.కానీ శేఖర్ కు తెలుగు చదవటం రాదు.అందుకు అమ్మను గాని నాన్నగారిని అడుగుతుండెను.వారికీ తోచినప్పుడు చిత్రాల పేర్లు చెప్పుతూ ఉండెను.ఇదే కాక ఈనాడు వార్తాపత్రిక ప్రతిదినం అమ్మగారి ఇంట్లో చూసేను.అందులో "తెరపై ఈనాడు" చదువుదాం అనుకునేవారు శేఖర్.అప్పుడప్పుడు బావల చేత లేక మావయ్య చేత చదివించి వినేవారు.కానీ ఇలా ఎన్నాళ్లు ? ఎందుకంటే బావలు మరదళ్లు ఇక అట పట్టించటం మొదలు పెట్టారు.శేఖర్ కి తెలుగు రాదని.చిత్రాల పేర్లు ఇష్టముంటే చెప్పే వారు.లేక పొతే లేదు.కొన్ని కొన్ని సార్లు తప్పుడు పేర్లు కూడా చెప్పే వారు !!అంతే కాకుండా దూరదర్శన్ హైదరాబాద్ లోప్రతి శనివారం వచ్చే తెలుగు చలన చిత్రం,ప్రతి గురువారం వచ్చే చిత్రలహరి పాటల కార్యక్రమాలు, బలమురళీకృష్ణగారి వెండితెర కార్యక్రమాలు చూసి, విని తెలుగు ఇంత అందంగా ఉంటుందని అనిపించేది శేఖర్ కి. ఎంతైనా మాతృభాష కదా. భువనేశ్వర్ లో తెలుగు చిత్రాలు చూడటం చాలా అరుదు.అక్కడ దూరదర్శన్ లో ఏ రెండు మూడు నెలలకొకసారి ఆదివారం మధ్యాహ్నం గంటలు ౧.౩౦ నిమిషాలకు తెలుగు చిత్ర చూడటం అయ్యేది.ఇక తెలుగు వార్తాపత్రికలు లేవు. స్వాతి, ఆంధ్రజ్యోతి వంటి సచిత్రపత్రికలు తెలిసిన వారి ఇంట్లో చూడటం అయ్యేది.చలనచిత్ర భావంతులలో తెలుగు చలన చిత్రాల వీక్షించే ప్రసక్తే లేదు.ఎందుకంటే భువనేశ్వర్ లో ౧౯౮౦ దశాబ్దిలో ఆదివారం ఆదివారం మాత్రమే ఒక చిత్ర ప్రదర్శన ఉండేది.అందుచేత విశాఖపట్నం లో ఉండటం ఒక ఆనంద విహార యాత్ర.
ఇక విశాఖపట్నం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ మోటారుబండీలలో పేరుపలకలు, రవాణా సంస్థ మోటారుబండి నిలయంలో సమయ సారణి, ప్రయాణ చీటీలు ఇచ్చు స్థానాలలో,దేవాలయాలలో పేరుపలకలు కూడా తెలుగు లోనే వ్రాసి ఉండేవి.ఇప్పటికి అదే రీతి ఉంది.ఉండాలి కూడా.మన రాష్ట్రంలో మన భాషకు ప్రాధాన్యం ఇచ్చి తీరాల్సిందే.ఇక శేఖర్ కు తెలుగు చదవటం, వ్రాయటం నేర్చుకొని తీరాల్సిందే అని అనిపించింది.అమ్మమ్మగారు తెలుగు వాచకం కొని ఇచ్చారు ౧౯౮౩ లో.కానీ అంతగా చదవలేదు.కానీ ఇప్పుడు ఆ పుస్తకం శేఖర్ తీశారు ౧౯౮౫లో .మెల్లగా తెలుగు అక్షరాలు చదవటం ఇంకా వ్రాయటం మొదలు పెట్టారు.సెలవులలో అమ్మగారి చేత, అత్తల చేత మెల్లగా అక్షరాలు, గుణింతాలు , వత్తులు నేర్చుకు కున్నారు.సుమారు ఒక నెలలో బాగానే చదవటం వచ్చింది.ఇక తెలుగు చిత్రాల పేర్లు చదవటం వచ్చింది.శేఖర్ కు ఎంతో సరదా అనిపించింది.
ఇది ఇలా ఉండగా, అప్పుడప్పుడు తాతగారు చెప్పిన వేమన పద్యాలూ విన్నారు.అలాగే చిన్నాన్నగారు బ్యాంకు ఉద్యోగం రిత్యా నరసాపురం, శృంగవరపుకోట, సీతానగరం వంటి పలు ఊర్లు తిరగటంతో ఆంధ్ర ప్రదేశ్ వైవిధ్యం తెలిసెను.ఇక ఈ దేశీయ ప్రాంతాలలో తెలుగు తప్ప వేరే భాష ఉండదు మోటారుబండీలలో, దుకాణాలలో.ఇతర సార్వజనిక ప్రాంతాలు ఇంకా కార్యాలయాలలో కౌద తెలుగు మాత్రమే వ్యవహరించ బడును.
ప్రతి ఏటా విశాఖపట్నం వెళ్లి తెలుగు ఇంకా బాగా నేర్చుకొని వచ్చెను శేఖర్. అంతే కాకుండా వార్తాపత్రికలు చదవటంతో ఇంకాస్త అవగాహన పెరిగింది.ఇక ఎవరి సహాయం అవసరంలేదు తెలుగు వ్రాయటం చడటం కోసం.అమ్మమ్మ తాతగార్లకి, మామ్మగారికి ఉత్తరాలు కూడా వ్రాయటం మొదలు పెట్టారు.అది చదివి పెద్దవారు ఎంతో ఆనందించారు.మెల్లగా శేఖర్ కి తెలుగు రచనలు, పద్యాలూ, తెలుగు పాటల పైన మక్కువ పెరిగెను.అప్పుడు మాతృభాషా విలువ సంపూర్ణంగా శేఖర్ గ్రహించెను.ఎందుకంటే బంధువులు దగ్గర సొంత భాషే చెల్లెను.
నీతి మాట: మాతృభాష పైన ప్రేమ, అభిమానం, గౌరవం , ఆత్మగౌరావం అప్పుడు ఉంది తీరాల్సిందే.సొంత ప్రదేశంలో సొంత భాషలో మాట్లాడటం, వ్రాయటం మరియు చదవటం ఎంతో అనివార్యం.అందుచేత తెలుగు వారు తన సంతతి కి అన్ని విధాలుగా తెలుగు నేర్పించాలి.
రచన: శ్రీ రాజశేఖర్ చెముడుపాటి ('చీమ')
No comments